నక్సల్బరీ తొలి అమరులు మహిళలే..! చరిత్రలో నిలిచిన మే 25 ఘటన
నక్సల్బరీ తొలి అమరులు మహిళలే..!
(వ్యాసకర్త ;S A. డేవిడ్)
........
మే 25, 1967.
మధ్యాహ్నం 2 గంటలు.
నక్సల్బరీ సమీపంలోని బెంగాయ్ జోట్ గ్రామం.
ధనేశ్వరి దేవి నాయకత్వంలో వందలాది మంది మహిళలు గుమిగూడి ఉన్నారు.
స్ధానిక భూస్వామికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించడానికి మహిళలంతా గుమిగూడి వున్నారక్కడ. పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. ఏ క్షణంతో ఏం జరుగుతోంది తెలియని స్థితి. అంతకు రెండు రోజుల నుండి ఆ ప్రాంతంలో స్థానిక రైతు కూలీలకూ,పోలీసులకూ మధ్య చెదురుమదుర సంఘటనలు జరుగుతూనే వున్నాయి.
మే 24 వ తేదీన 'బిగుల్ కిషన్' అనే గిరిజన రైతు తాను సాగు చేసుకుంటున్న భూమిపై కోర్టు తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది. బిగుల్ కిసాన్ అప్పటికే సీపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘమైన ’కృషక్ సభ‘లో సభ్యుడిగా ఉండేవాడు. ఆ సంవత్సరం మార్చిలో జరిగిన ఒక సమావేశంలో కృషక్ సభ కౌలు రైతులుగా వున్న వాళ్ళు తమ భూములను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమైన తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని దృష్టిలో వుంచుకున్న కిషన్, తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును చేతబట్టుకొని మే 21న కిసాన్ తన పంటను కోయడానికి వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన భూస్వామి టిర్కీ మనుషులు అతనిపై దాడి చేసి చావు అంచున వదిలి వెళ్ళి పోయారు.
బిగుల్ కిషన్ మీద భూస్వామి మనుషులు చేసిన దాడి వార్త స్థానిక రైతులు, గిరిజనులలో దావానలంగా వ్యానించింది. అగ్రహం చెందిన రైతులంతా ఏకమై భూస్వామి ఇంటిపై దాడి చేశారు. దాడివార్త ముందే తెలిసిన భూస్వామి గ్రామం విడిచి పారిపోవడంతో ఇంట్లో వున్న ధాన్యాన్ని దోచుకొని రైతులంతా పంచుకున్నారు.
దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారిపోయింది.
ఆ మరుసటిరోజు మే 24న, రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు, పరిస్థితులను తమ అధీనంలో వుంచుకునేందుకు వందలాది మంది పోలీసులు ఆ నక్సల్‌బరీ పరివాహక ప్రాంతాల్లోకి చొరబడ్డారు. దొరికిన రైతులకు దొరికినట్లు చితకబాదుతుంటే ఆదివాసీ రైతులు బాణాలతో, వ్యవసాయ పనిముట్లతో తిరగబడ్డారు. ఈ ఘర్షణలో, నక్సల్బరీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న 'సోనమ్ వాంగ్డే'పై ఆదివాసీ రైతులు విసిరిన మూడు బాణాలు ఆయన శరీరంలోకి దూసుకుపోవడంతో అక్కడికక్కడే సోనమ్ వాంగ్డే మరణించాడు.
ఈ ఘటనతో పోలీసులు కాసింత వెనగడుకు వెసినా, ఏ క్షణంలో ప్రతికారంతో రెచ్చిపోతారో అన్న భయం ఆదివాసీ రైతాంగంలో అనుమానంగా వుండనే వుంది. అందుకే ఏ పరిస్థితినైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా అన్నట్లు మే 25వ తేదీన ధనేశ్వరి దేవి నాయకత్వంలో వందలాది మంది మహిళలు గుమిగూడి ఉన్నారు.
మహిళలు చేపట్టిన ప్రదర్శనను చెదరగొట్టెందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినప్పటికీ మహిళా కౌలు రైతులు, కూలీలు ఎదురునిలిచి పోరాడటంతో, రెచ్చిపోయిన పోలీసు బృందం మహిళలపై విచక్షణారహితంగా పద్దెనిమిది రౌండ్లు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మహిళలు, ఒక యువ రైతులు నేలకొరిగాడు. ఒక పోలీసు తూట ధన్వేశ్వరి రొమ్మును చీల్చుకుని వెళ్లి, ఆమె వీపుపై చుట్టబడిన పసిగుడ్డును పొట్టన పెట్టుకుంది. తల్లి పొదివిని అదిమిపెట్టుకున్న మరో చిన్నారీ నేలకోరిగాడు.
దీంతో కోపోద్రేకులైన మహిళలు, స్థానిక రైతులు రక్తం మడుగులో తడిచిన తమ సహచరులను భూజాన మోస్తూ వుంటే, మిగతా రైతులంతా పోలీసుల మీద తిరగబడి దొరికిన పోలీసులను దొరికినట్లు తిరబడ్డంతో కాలికి బుద్దిచెప్పి వెనుదిరిగారు పోలీసులు.
ఈ వార్త దావానంలా కలకత్తాకు విస్తరించడంతో విద్యార్థి లోకం రోడ్కెక్కింది. హంతక ముఖర్జీ, జ్యోతిబసుల నాయకత్వంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వం రాజీనామా చేయాలని విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. రైతాంగానికి మద్దతుగా, తేజాకు తోటల కార్మకులు సమ్మెకు దిగారు. దాదాపు రెండు నెల పాటూ డార్జిలింగ్ కొండలు ఉద్యమ కేంద్రాలుగా మారిపోయాయి.
హోం మంత్రిగా వున్న జ్యోతిబసు నాయకత్వంలోని పోలీసులు ఆదివాసీ నాయకులైన జంగల్ సంతాల్ మొదలైన నాయకుల్ని అరెస్టు చేశారు. చారుమజుందార్, కానూసన్యాల్ వంటి నేతలు రహస్య జీవితంలోకి వెళ్ళిపోయారు. త్రివేణీకానూ, శోభన్ ఆలీ, మిర్కామాజీవా వంటి నేతల్ని పొట్టన పెట్టుకుంది ప్రభుత్వం. కానీ కాసింత వెనుకపట్టు పట్టినట్లు అనిపించినా ఫినిక్స్ లా లేచి ఎదురునిలిచింది నక్సల్‌బరీ.
జూన్ 28, 1967న, బీజింగ్ రేడియో “భారతదేశ భూమిపై వసంత మేఘం గర్జించింది. డార్జిలింగ్ ప్రాంతంలోని విప్లవ రైతులు తిరుగుబాటు చేశారు.” అంటూ ప్రకటించింది.
మరణించిన వాళ్ళు 👇
1.ధనేశ్వరీ దేవి
2.సిమేశ్వరి ముల్లిక్
3.నయనేశ్వరి ముల్లిక్
4.సురుబాల బర్మన్
5.సోనమతి సింగ్
6.ఫుల్మతీ దేవి
7.సంసారి సాయిబాని
8.గౌద్రౌ సాయిబానీ
9.ఖర్సింగ్ ముల్లిక్
10,11. ఇద్దరు చిన్న పిల్లలు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇



Click here to 👆 Follow Our WhatsApp Channel