మాట తప్పని ముఖ్యమంత్రి.. పేదవాడి ఇంటి కల సాకారం
రాజకీయాల్లో ఇచ్చిన మాట గాలికి కొట్టుకుపోయే కాలమిది. కానీ, తాను ఇచ్చిన హామీని ప్రాణం ఉన్నంతవరకు మర్చిపోనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిరూపించారు.
మూడేళ్ల క్రితం ఒక సామాన్య పేద కుటుంబానికి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ.. శనివారం కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో నూతన 'ఇంద్రమ్మ ఇల్లు' గృహప్రవేశం అత్యంత వైభవంగా జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు.
2023 మార్చి 18న పిసిసి అధ్యక్షుని హోదాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో, భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధితులను రేవంత్ రెడ్డి పరామర్శించారు.
ఆ రోజు వారి కన్నీళ్లు చూసి చలించిపోయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని మాటిచ్చారు. నేడు ఆ మాట అక్షర సత్యమైంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఇది కేవలం ఒక ఇల్లు కాదు, ఇది రేవంత్ రెడ్డి నైతికతకు నిదర్శనం అన్నారు.
రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు ఎన్నో చెబుతారు, కానీ అధికారంలోకి వచ్చాక పాత మాటలను మర్చిపోవడం పరిపాటి. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అలా కాదు. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పర్యటనలో ఇచ్చిన మాటను గుర్తుంచుకుని, నన్ను పిలిచి మరీ 'చిన్న మల్లారెడ్డిలో ఆ కుటుంబానికి ఇచ్చిన మాట ఏమైంది షబ్బీర్ భాయ్?' అని ఆరా తీశారని ఆయన తెలిపారు.
ప్రభుత్వం నుండి ఇంద్రమ్మ ఇంటి పథకం కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా, ఆ ఇల్లు ఒక దేవాలయంలా సుందరంగా ఉండాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచించారని,అందుకే వ్యక్తిగతంగా రెండు ఇండ్లకు చేరో 5 లక్షల రూపాయలు చొప్పున 10 లక్షలువెచ్చించి, పూర్తిస్థాయి సౌకర్యాలతో ఈ ఇంటిని నిర్మించామని షబ్బీర్ అలీ వివరించారు. ఈ రోజు ఈ కుటుంబం ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూస్తుంటే.. మా ప్రభుత్వానికి వందల కోట్ల ప్రజా పాలన విజయం దక్కినట్టు అనిపిస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదవాడి పక్షమేనని చెప్పడానికి ఈ గృహమే ఒక సాక్ష్యం అన్నారు ఆయన.
కేవలం ఇల్లు కట్టించి ఇవ్వడమే కాకుండా, గృహప్రవేశం సందర్భంగా ఆ రెండు కుటుంబాలకు షబ్బీర్ అలీ కొత్త వస్త్రాలు, పూర్తి వంట సామాగ్రి , నిత్యావసర సరుకులను స్వయంగా అందించారు.
ఒక తండ్రిలా, అన్నలా నిలబడి ఇంటి నిర్మాణం దగ్గర నుండి గృహప్రవేశం వరకు అన్ని తానై చూసుకున్న షబ్బీర్ అలీ చొరవ తీసుకున్నారు
జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క లబ్ధిదారులకు ఫోన్ చేసి మాట్లాడారు.ముఖ్యమంత్రి మీ కల నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని, కొత్త ఇంట్లో మీ కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.
చిన్న మల్లారెడ్డి వీధుల్లో నేడు పండుగ వాతావరణం నెలకొంది. చెప్పిన మాటను తు.చ తప్పకుండా పాటించే నాయకుడు మా ముఖ్యమంత్రి" అంటూ లబ్ధిదారులు ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు.