దేవీప్రసాద్ సార్... ఒక చిరునవ్వుల సంతకం! – దేశపతి శ్రీనివాస్ భావోద్వేగ రచన

వాల్మీకి రామాయణంలో రాముణ్ణి 'స్మితపూర్వాభిభాషి' అంటడు. అంటే, మాట్లాడకముందే ఒక చిరునవ్వు విసిరేవాడని అర్థం. దేవీ ప్రసాద్ సార్ ని చూస్తుంటే నాకు సరిగ్గ ఇదే మాట గుర్తొస్తుంది. ఎదుటి మనిషిని నొప్పించకుండ, టైమింగ్ మిస్ కాకుండ మాట్లాడటం... అసలు ఎవరి గురించీ చెడ్డగ అనకపోవడం... ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే వచ్చేటివి కావు, అది ఒక 'నేచర్'. ఆ క్వాలిటీసే ఆయన్ని ఒక స్పెషల్ లీడర్‌గా నిలబెట్టాయి.
నేను డిగ్రీ చదివే రోజుల్లో 'మరసం' పనుల మీద సిధారెడ్డి సార్ తోని కలిసి మెదక్ కు పోయినప్పుడు మొట్టమొదటిసారి దేవీప్రసాద్ సార్ 'ఆత్మీయ స్పర్శ'కు గురయ్యాను. అప్పటినుండి ఇప్పటిదాకా ఆ ఆత్మీయ అనుబంధ స్పర్శ అంతే తడిగా అట్లనే ఉంది. ఇగ లక్ష్మక్క గురించి చెప్పాలె... ఇంటికి వచ్చే బుద్ధిజీవులు, కవులు, ఉద్యమకారుల పాలిట ఆమె నిజంగా 'అన్నపూర్ణ'. అక్క చేతి వంట రుచి చూసిన వాళ్లెవరూ మర్చిపోలేరు. దేవీప్రసాద్ సార్ సహచరిగా ఆమె ఎన్నో కష్టనష్టాలను ఓపిగ్గా భరించింది తప్ప, ఎప్పుడూ కొంచెం కూడా యాష్ట పడలేదు.
సిధారెడ్డి గారితో ఉన్న ఆత్మీయ స్నేహంతో మెదక్ స్టడీ సర్కిల్, మంజీరా రచయితల సంఘం స్థాపనలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయం. కేవలం నిర్మాణం మాత్రమే కాదు, సహనశీలిగా ఆయన చేసిన సమన్వయంతో'మరసం' ఒక చల్లని ఛత్రఛాయగా ఎదిగింది. ఆ వేదికనే నా సామాజిక దృక్పథానికి పదును పెట్టింది.
నిజాం కాలపు నిరంకుశత్వానికి ఎదురుతిరిగి, గుల్బర్గా జైలు గోడలు దూకి, కరెంటు తీగల మీద పడి, గాయపడినా కూడా ఉద్యమ బాట వీడని అజ్ఞాత యోధుడు గుండవరం రాధాకిషన్ రావు గారి వారసుడు దేవీప్రసాద్ సార్. ఇప్పుడు 90 ఏళ్ల వయసులో, కొంచెం డిమెన్షియాతో బాధపడుతున్న మాతృమూర్తి విజయలక్ష్మమ్మ మౌనంలో ఎన్ని ఎన్ని పోరాటాల కథలు, ఎన్ని విషాదాల వ్యథల జ్ఞాపకాలు అణగిపోయి ఉన్నాయో ఎవరికి ఎరుక? ఆ ముఖం మీద ఎప్పుడూ అనంతమైన 'అమ్మప్రేమ'నే వెలుగుతుంది తప్ప, ఆనాటి బాధల గురించి ఆమె ఎప్పుడూ నోరు విప్పి చెప్పలేదు..
వాళ్ల ఇద్దరి చైతన్యం ఆయనకు వారసత్వంగా వస్తే దాన్ని రాటుదేల్చింది మాత్రం పెద్దపల్లి ఐ టీ ఐ. ఆ చారిత్రాత్మక విద్యాలయం చల్లిన బీజాలు పుష్పించి ఫలించాయి. మెదక్ జిల్లాలో విప్లవ చేతనను విస్తరింప జేసే దోహద క్రియను తన చేత జరిపించాయి.
సార్ లో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏందంటే... ఎంతో గణనీయమైన కృషి చేస్తారు కానీ, ఆ తర్వాత ఏమాత్రం ప్రసిద్ధి కోరుకోకుండా చాలా డిటాచ్డ్ గా ఉంటారు. ఇప్పుడు టీవీ డిబేట్లలో, సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు కానీ, అప్పట్లో ఆయన పూర్తిగా ప్రసిద్ధి పరాఙ్ముఖుడు. ఎప్పుడు చెబుతాడో ఏమో గానీ, తను ఇంకా చెప్పని తన చరిత్రను తనే చెప్పాలె.
టీఎన్జీఓల యూనియన్ క్యారెక్టర్‌నే మార్చేసి, దాన్ని ఒక పవర్‌ఫుల్ ఉద్యమ సంస్థగా మార్చడంలో సార్ పోషించిన పాత్రను మర్చిపోలేము. స్వామిగౌడ్ - దేవీ ప్రసాద్ ల 'ముచ్చటైన జంట' ఆనాడు తెలంగాణను ఎట్ల ఉర్రూతలూగించిందో తెల్వనిది ఎవరికీ ? మేధావులను, కళాకారులను టి ఎన్జివో సంఘంతో అనుసంధానం చేయడంలో ఆయన చూపిన పనితనం అసామాన్యం.
కేసీఆర్ ఆయనను ఆప్యాయంగా 'దేవీ' అని పిలుస్తడు . హరీశన్న, కేటీఆర్ లకు కూడా ఆయన అంటే బాగ ఇష్టం, మర్యాద.
నేనైతే నా మనసులో ఉన్నవన్నీ 'ఖుల్లం ఖుల్లా' చెప్పుకునేది సార్‌తోనే. నా ఆవేశాకావేశాల్నీ, ఆత్మీయ స్పందనలనీ అన్నిటినీ హాయిగ ఆస్వాదిస్తడు.
తనకు మంచి 'సెన్స్ ఆఫ్ హ్యూమర్' ఉంది. రాజకీయాల మీద, వ్యక్తుల విపరీతాల మీద వేసే వ్యంగ్య బాణాలు మస్తు చమత్కారంగా ఉంటయి. అయితే ఆ 'చణుకులు' ప్రైవేట్ సంభాషణలల్లనే కాకుండా స్పీచులల్ల కూడా కొంచెం పలికిస్తే బాగుండు అని నా కనిపిస్తది.
66వ ఏట అడుగుపెడుతున్నా, సామాజిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఆనంద విషాదాలు చవి చూసినా... ఆ ఫేస్‌లో ఆ 'అలసట లేని చిరునవ్వు' మాత్రం అట్లనే వెలుగుతున్నది.
నిష్కామ కర్మ చేస్తూ నిత్యోత్సాహంతోటి ఉండటమే తనకు తెలిసిన 'సంజీవని విద్య'. తానంటే ఇప్పటికీ ఉద్యోగ కార్మిక మిత్రులకు ఒక ఉత్ప్రేరణ. ఉద్యమానికీ, పార్టీకి తాను చేసిన కృషికీ దోహదానికీ తగిన స్థానం ఇంకా రాలేదని అనిపించినప్పుడు బాధ కలుగుతుంది.
ఇవాళ హరీశన్న ఇంట్ల అలాజ్ పూర్ శ్రీనివాస్ రంగాచారి లతో కలిసి సార్‌ కు 'సాల్ గిరా ముబారక్' చెప్పినం.
హరీశన్న ఎంతో ప్రేమగా శాలువా కప్పి అక్కున చేర్చుకున్నడు. అక్కడున్నోళ్ళం అందరికీ ఆత్మీయంగా సంబురంగా అనిపించింది.
చివరిగా ఒక మాట... మెదక్ మిత్రులు శ్యామ్ సార్, సుధాకర్ సార్, భూపాల్ సార్, సిద్ధిపేట శ్రీనివాస్ రెడ్డి సార్, విక్రమ్ సార్... మీరంతా ఎక్కడున్నా వింటున్నారా?... మిత్రులమంతా ఒకసారి కలుద్దాం. పాత జ్ఞాపకాలను కలబోసుకుందాం. ఎప్పుడు కలుద్దాం? మీరే చెప్పాలి! హ్యాపీ బర్త్ డే టు దేవీ ప్రసాద్ సార్!
(దేశపతి శ్రీనివాస్,ఎమ్మెల్సీ✍︎....)

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్