22A భూముల జాబితాతో ప్రజలు ఇబ్బందుల్లో.. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై గణేష్ బిగాల విమర్శలు
.
"నిషేధిత" కుట్రతో
భూములను మింగాలని స్కెచ్
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల నయవంచన పాలనలో జరిగిన మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమం గణేష్ బిగాల నిర్వహించారు.
22A నిషేధిత జాబితాతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
- రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పోయిందని గణేష్ బిగాల మండిపడ్డారు.
- ముఖ్యంగా 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు చేరడం వల్ల రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
- 22A జాబితాలో భూములు చేరడంతో వాటిని అమ్ముకోవడం, కొనుగోలు చేయడం, బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం వంటి లావాదేవీలు నిలిచిపోతున్నాయని తెలిపారు.
- 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు వంటి రక్షించాల్సిన భూములను నిషేధిత జాబితాలో ఉంచే ఉద్దేశం ఉందని, అయితే ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా అందులో చేర్చడం అన్యాయమని అన్నారు.
2026 ఫిబ్రవరిలో లక్షల ఎకరాల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవహారంలో అవసరమైన భూములను కాకుండా, అనేక ప్రైవేట్ భూములను కూడా జాబితాలో చేర్చారని గణేష్ బిగాల ఆరోపించారు.
ప్రభుత్వ భూములను రక్షించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టులు సూచిస్తున్న సందర్భంలో, అధికారుల వైఫల్యాల కారణంగా ప్రైవేట్ భూములు 22Aలో చేరితే దాని బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.
మంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు సైతం తమ ఇళ్లు, భూములు 22A జాబితాలో చేరాయని చెబుతున్నారంటే రాష్ట్రంలో భూ రికార్డుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తాను సుమారు 25 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న గృహం కూడా 22A జాబితాలో ఉన్నట్లు ప్రముఖ పత్రికల్లో వచ్చిన వార్తలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అధికారుల తప్పిదాలకు ప్రజలను బాధ్యులను చేసి, ఇప్పుడు వారు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించడం సరికాదన్నారు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించుకోవడానికి దరఖాస్తులు చేసుకుని, అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేసిందని గణేష్ బిగాల గుర్తు చేశారు.
రైతులకు పెట్టుబడి సాయం,ఉచిత విద్యుత్ ,రైతు బీమా ,రైతు భరోసా ,యంత్ర లక్ష్మి ద్వారా వ్యవసాయ యంత్రాల అందజేత
వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు అండగా నిలిచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు.
రైతుకు ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రైతు బీమా ద్వారా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు యంత్ర లక్ష్మి ద్వారా ఆధునిక వ్యవసాయ పరికరాలను అందించామని గుర్తు చేశారు.
తెలంగాణ రైతాంగాన్ని బలోపేతం చేసింది కేసీఆర్ ప్రభుత్వం
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం తీసుకెళ్లిందని గణేష్ బిగాల అన్నారు.
తెలంగాణలో సాగు విస్తీర్ణం, వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, దేశ ఆహార భద్రతలో తెలంగాణ రైతులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందాల్సిన రైతు భరోసా, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తూ, ఎరువుల విషయంలో కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో హైడ్రా పేరుతో కూల్చివేతల భయాన్ని సృష్టిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని గణేష్ బిగాల అన్నారు.
కంటేశ్వర్ ఆలయ భూముల విషయంలో ఏం జరుగుతోంది? అసైన్మెంట్ భూముల పరిస్థితి ఏమిటి? గూపన్‌పల్లిలోని వక్ఫ్ భూములను 22Aలో ఎందుకు చేర్చలేదు? ఏ ఉద్దేశం తో చేర్చలేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రక్షించాల్సిన భూములను వదిలిపెట్టి, సామాన్య ప్రజలు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న ప్రైవేట్ భూములను 22Aలో చేర్చడం వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బోధన్ పట్టణంలో దాదాపు 40 శాతం భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు తమ భూములను అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గణేష్ బిగాల తెలిపారు.
భూమి అనేది సామాన్య ప్రజల జీవితకాల సంపాదన అని, అలాంటి ఆస్తులపై ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరించడం వల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.
బీఆర్‌ఎస్ ఎక్కడ ఉందని ప్రశ్నించే వారికి ఈరోజు ధర్నానే సమాధానం
“బీఆర్‌ఎస్ పార్టీ ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించే వారికి ఈరోజు ధర్నా కార్యక్రమానికి వచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలను చూస్తే సమాధానం తెలుస్తుందని గణేష్ బిగాల అన్నారు.
ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో “బీఆర్‌ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి పీకేస్తాడు” అని వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు.
“రేవంత్ రెడ్డి కాదు కదా.. మీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కలిసి వచ్చినా బీఆర్‌ఎస్ పార్టీని ముట్టుకోలేరు” అని గణేష్ బిగాల ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని, ప్రజల సమస్యలపై ఎక్కడైనా, ఎప్పుడైనా నిలదీస్తుందని స్పష్టం చేశారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇


Click here to 👆 Follow Our WhatsApp Channel