మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. సమిష్టి కృషికి కలెక్టర్, సీపీ పిలుపు

నిజామాబాద్,
మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి
జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్, సీపీ వెల్లడి
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, వాటి నిరోధానికి అవలంభించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశానిర్దేశం చేశారు. గడిచిన రెండు మాసాలలో జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖల అధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్ఫ్రాజోలం ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి పక్కాగా కృషి చేయాలన్నారు.
డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలను చైతన్యపరచేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రహరీ క్లబ్స్, యాంటీ డ్రగ్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో అవి పని చేసేలా చూడాలన్నారు. కొంతమంది గర్భిణీ మహిళలు సైతం క్లోరోఫాం, డైజోఫాం, అల్ఫ్రాజోలం వంటి హానికారకమైన పదార్థాలను వినియోగిస్తూ తయారు చేసిన కల్తీ కల్లు సేవిస్తున్నట్లు సమాచారం ఉందని, ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీయడంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పై కూడా తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గర్భిణీ స్త్రీలు కల్తీ కల్లు బారిన పడకుండా గ్రామగ్రామాన అంగన్వాడి కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో సైతం మత్తు పదార్థాల గురించి ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని సూచించారు. ప్రధాన రహదారుల పక్కన దాభాలలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. తద్వారా ఓపీఎం (నల్లమందు) వంటి వాటి వినియోగాన్ని గుర్తించి నియంత్రించవచ్చని సూచించారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా చూడాలన్నారు.
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను రవాణా చేసే వారిని, వాటిని విక్రయిస్తున్న వారిని, వాటిని వినియోగిస్తున్న వారిని పక్కాగా గుర్తిస్తూ గట్టి నిఘా కొనసాగిస్తున్నామని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య తెలిపారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కూడా ఫోన్ చేసి తెలియజేయవచ్చని సీ.పీ సూచించారు. మత్తును కలుగజేసే ఔషధాలు పక్కదారి పట్టకుండా, వాటి వినియోగం పై కూడా పర్యవేక్షణ జరపాలని జిల్లా ఔషధ నియంత్రణ విభాగం అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరం లోపు సిగరెట్లు, గుట్కాలు వంటి విక్రయాలు జరుగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఈఓ అశోక్, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల,.డీటీఓ ఉమా మహేశ్వరరావు, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, డీడబ్ల్యూఓ పద్మ తదితరులు పాల్గొన్నారు.

మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్