నిజామాబాద్‌లో ఘనంగా బాబూ జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలు

నిజామాబాద్,
భారత మాజీ ఉపప్రదాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేడ్కర్ భవన్ ఆవరణలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రాం చేసిన సేవలను కొనియాడారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రాం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రాం అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని భావితరాలకు తెలియజేస్తూ, వారిలో స్ఫూర్తిని నింపేందుకు ప్రభుత్వం అధికారకంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, ఫూలే వంటి మహనీయుల కృషి ఫలితంగానే నేడు మనమంతా గౌరవప్రదమైన స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్నామని కలెక్టర్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించారని, తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయన ఓ మేధావిగానే కాకుండా మంచి వక్తగా, మానవతా దృక్పథం కలిగిన నాయకుడిగా ప్రజాదరణ పొందారని అన్నారు. బీహార్ రాష్ట్రం పాట్నాలోని పది ఎకరాల విస్తీర్ణంతో కూడిన గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రాం సభకు ఆదరణ దక్కకుండా చేసేందుకు ఆనాడు ఆయన రాజకీయ ప్రత్యర్థులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయడం బాబు జగ్జీవన్ రాం కు ఉన్న ఆదరణకు నిదర్శనం అని అన్నారు. ఇలాంటి మహనీయుల ఆశయాలను స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు తమ ప్రతిభను మెరుగు పర్చుకోవాలని పిలుపునిచ్చారు.
మహనీయుల జీవిత విశేషాల గురించి తెలుసుకొని, వారి అడుగుజాడల్లో పయనించాలని సూచించారు. జిల్లాలో వివిధ కుల సంఘాల వారు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అంకిత భావంతో కృషి చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు మాట్లాడుతూ, దేశానికి ఎన్నో విధాలుగా సేవలందించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రాం అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రాం బడుగు, బలహీన వర్గాలు రాజ్యాంగ ఫలాలు అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో పయనించాలనే సంకల్పంతో అహరహం శ్రమించారని అన్నారు. జగ్జీవన్ రాం సమాజంలో సమానత్వం కోసం పరితపించిన మహనీయుడని కొనియాడారు.
జయంతి కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి రాజ్ గంగారాం, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సుమన్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఇటీవలే మృతి చెందిన ప్రముఖ దళిత నేత సిద్ధిరాములును ఈ కార్యక్రమం సందర్భంగా స్మరిస్తూ, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్